BCCI Chief Jagmohan Dalmia passes away

బిసిసిఐ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా కన్నుమూత

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. 1979 నుంచి ఆయన బిసిసిఐకి సేవలందిస్తూ వస్తున్నారు. 1983లో ఆయన బిసిసిఐ కోశాధికారిగా పనిచేశారు భారత క్రికెట్‌కు పునాదులు వేసినవారిలో చెప్పుకోదగిన వ్యక్తి జగ్‌మోహన్ దాల్మియా. 1997లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిసిసిఐని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఆయనది కీలకమైన పాత్ర. మూడు రోజుల క్రితం ఛాతీ నొప్పితో దాల్మియా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బిఎం బిర్లా ఆస్పత్రిలో చేరారు. ఆయన గురువారం రాత్రి ఆండియోగ్రఫీ జరిగింది. రెండు రోజుల పాట వైద్యులు దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఆ రెండు రోజుల పాటు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించింది. నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణపై బిసిసిఐ నుంచి ఆయన 2006లో ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత 2013లో ఎన్. శ్రీనివాసన్ పక్కకు జరగాల్సి రావడంతో 2013 జూన్‌లో ఆయన బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అల్లుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్ష పదవికి దూరం కావాల్సి వచ్చింది. జగ్‌మోహన్ దాల్మియా 1940 మే 30వ తేదీన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. దాల్మియా మొదటగా బీసీఏ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత 1970లో బీసీసీఐ బోర్డులో సభ్యునిగా చేరారు. కాలేజీ రోజుల్లో ఆయన వికెట్ కీపింగ్‌పై మక్కువ చూపేవారు. వికెట్ కీపర్‌గా కోల్‌కతాలోని పలు క్లబ్‌లకు ఆడారు. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంఎల్ దాల్మియా కంపెనీని ఏర్పాటు చేశారు. నిర్మాణ రంగంలో దేశీయంగా ముఖ్యమైన కంపెనీల్లో ఒక్కటిగా అది పేరు సంపాదించుకుంది. ఆయన రెండు సార్లు బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 2001 నుంచి 2004 వరకు పనిచేశారు. భారత క్రికెట్ రాజకీయాల్లో ఆయన మ్యాకీవెల్లీగా పరిగణనలోకి వచ్చారు.

Jagmohan-dalmiya

దాల్మియా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచంలో కెల్లా బీసీసీఐని అత్యంత ధనికబోర్డుగా మార్చిన ఘనత జగ్‌మోహన్ దాల్మియాది. అలాంటి జగ్‌మోహన్ దాల్మియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 35 ఏళ్ల తన క్రీడా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పళ్లాలను జగ్‌మోహన్ దాల్మియా చవిచూశాడు. 1978లో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కోశాధికారిగా కెరీర్ ఆరంభించిన దాల్మియా 1983 బీసీసీఐ కోశాధికారిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. 1987, 1996 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు భారత్ ఉపఖండంలో జరగడంలో కీలకపాత్ర పోషించాడు. 1997లో ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో వరల్డ్ క్రికెట్‌కు భారత్ కేంద్రంగా మారింది. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ బోర్డు ఒక బలమైన, సంపన్నమైన బోర్డుగా అవతరించేలా చేశాడు. వరల్డ్ క్రికెట్ గతినే మార్చేశాడు. 1990ల్లో దాల్మియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి బీసీసీఐ రూ. 81.60 లక్షల లోటు బడ్జెట్‌లో ఉంది. అదే సంవత్సరం రూ. 100 కోట్లకుపైగా టర్నోవర్ సాధించి ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా అవతరించింది. టీవీ హక్కుల వివాదంలో 2000లో ఐసీసీ నుంచి బయటకు వచ్చిన దాల్మియా 2001లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004వరకు ఆ హోదాలో కొనసాగారు. 2005 ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వరల్డ్ కప్ సమయంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆ తర్వాతి ఏడాది అతడిని బోర్డు నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత కాలంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం యావత్ దేశాన్ని కుదేపినప్పుడు బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పేరు: జగ్‌మోహన్ దాల్మియా పుట్టినరోజు: మే 30, 1940 పుట్టిన స్థలం: కోల్‌కత్తా, ఇండియా 1978: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శిగా 1983: బీసీసీఐ కోశాధికారిగా 1993: క్యాబ్ అధ్యక్షుడిగా 1997: ఐసీసీ అధ్యక్షుడిగా 2000: ఐసీసీ ఛైర్మన్ పదవిని వదులుకున్నాడు 2001: బీసీసీఐ అధ్యక్షుడిగా 2005: బీసీసీఐ అధ్యక్షుడిగా ముగింపు 2006: ఆర్ధిక ఆరోపణలతో బీసీసీఐ నుంచి బహిష్కరణ 2006: క్యాబ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక 2007: క్యాబ్ అధ్యక్షుడిగా రాజీనామా 2013: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నిక 2015: 10ఏళ్ల విరామం తర్వాత మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక, 2015: సెప్టెంబర్ 20 (ఆదివారం) కన్నుమూత
ThanQ Visit Again.

Related Posts