Showing posts with label Amaravathi. Show all posts
Showing posts with label Amaravathi. Show all posts

రాజధానిలో మొదటి అన్న క్యాంటీన్




తమిళనాడులో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లకు తగ్గట్లే ఏపీలోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి ఈ క్యాంటీన్ల ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నా.. క్యాంటీన్లను ఏర్పాటు చేసింది లేదు. రూ.5లకు బోజనం అందించటం ఈ అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశంగా చెప్పాలి.

అదే సమయంలో మరింత చౌకగా టిఫిన్లను కూడా ఈ క్యాంటీన్ల ద్వారా అందించాలని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తొలి క్యాంటీన్ ను ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తొలి అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమ్మక్యాంటీన్ల తీరును ఏపీ మంత్రులు తమిళనాడుకు వెళ్లి మరీ అధ్యయనం చేసి వచ్చారు. అక్కడి క్యాంటీన్ల పని తీరును పరిశీలించి.. మనకు తగ్గట్లుగా మార్పులుచేసి.. మరో పది రోజుల్లో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయనున్నారు.

తొలిదశలో భోజనాన్ని అందించటం.. తర్వాతి కాలంలో టిఫిన్లు అందించాలన్న అభిప్రాయం ఒక పక్క వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేకుండా రెండింటిని ఒకేసారి కలిపి వడ్డించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ కాంట్రాక్ట్ ను ఎవరికి అప్పగించాలన్న అంశంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఏమైనా.. అన్న క్యాంటీన్ ను పది రోజుల్లో స్టార్ట్ చేయటం మాత్రం ఖాయమని చెబుతున్నారు.

‘అమరావతి’ నిర్మాణానికి రూ.27097 కోట్లేనా?

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? లక్ష కోట్లు అనే వారు కొందరైతే.. మరికొందరు రూ.3లక్షల కోట్లు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.3 నుంచి రూ.4లక్షల కోట్లు కావాలని చెబుతారు.

మరి.. అమరావతి కోసం కేంద్రం ఎంత ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని ఇప్పటివరకూ స్పష్టం చేసింది లేదు. అసలు.. కేంద్రం దృష్టిలో అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని భావిస్తోందన్న విషయం మీద కూడా ఇప్పటివరకూ నోరు విప్పింది లేదు. తాజాగా.. అమరావతి నగర నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాను కేంద్రాన్ని ప్రశ్న రూపంలో వేశారు.

దీనికి సమాధానం చెప్పిన కేంద్రం.. అమరావతి నిర్మాణం కోసం అయ్యే ఖర్చు రూ.27097 కోట్లుగా అంచనా వేసింది. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తుందంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్రం బదులిచ్చింది. ఇప్పటికే అమరావతి కోసం కేంద్రం రూ.1850కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో. కేంద్రం నుంచి అమరావతికి వచ్చేది చిల్లర డబ్బులేనని తాజా లెక్కతో తేలిపోయినట్లే.

కేంద్రం లెక్కలో అమరావతి నిర్మాణానికి వేసిన ఖర్చుల లెక్క చూస్తే..

= నిర్మాణాలకు; రూ.10519 కోట్లు

= రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు ; రూ.1596 కోట్లు

= రాజధాని నగరంలో మౌలిక వసతుల కల్పన ; రూ.5861 కోట్లు

= మౌలిక సదుపాయాల వృద్ధి విస్తరణకు ; రూ.9181 కోట్లు

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న వీఐపీల భద్రత కోసం తెలంగాణ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెప్పించినట్లు ఏపీ డీజీపీ రాముడు అన్నారు. మంగళవారం ఆయన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపై జరుగుతున్న ఏర్పాట్ల గురించి మాట్లాడారు. రాజధాని శంకుస్థాపన, దసరా పండుగ, ప్రధాని మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సామాన్య ప్రజలకు సైతం ఉండవల్లి మీదుగా అమనుతించేలా ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ఎనిమిది రహదారులను సిద్ధం చేశామన్నారు. ఒక్కో వైపు నుంచి వచ్చే వారికి ఒక్కో దారిని ప్రకటించారు. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ముఖ్యమైన సూచనలు చేశారు.

[caption id="attachment_429" align="aligncenter" width="350"]Amaravathi AP capital Amaravathi AP capital[/caption]

గన్నవరం విమానాశ్రయంలో దిగి వేదికకు వచ్చే వారు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు దారిలో కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లి చేరుకోవాలి. తాడేపల్లి వద్ద వంతెన కింద నుంచి కుడివైపు తిరిగి పంప్ హౌస్, ఎన్టీఆర్ కట్ట మీదుగా ఉండవల్లి జంక్షన్‌కు, అక్కడి నుంచి ఉండవల్లి వంతెన దాటి ఎడమవైపు తిరిగి భీష్మాచార్య రోడ్డు మీదుగా ఉద్ధండరాయుని పాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకోవచ్చు. ఇది వీఐపీ పాసులున్న వారికి మాత్రమే. సాధారణ పాసులు ఉన్నవారు ఇదే దారిలో ఉండవల్లి జంక్షన్ నుంచి స్క్రూ బ్రిడ్జి మీదుగా వేదిక వద్దకు వెళ్లాల్సి వుంటుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు సైతం తాడేపల్లి వరకూ వచ్చి ఇదే దారిలో చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వారు నందిగామ, ఇబ్రహీంపట్నం దాటాక గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, రామవరప్పాడు మీదుగా బెంజ్ సర్కిల్ చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు గుంటూరు జిల్లా అమరావతి నుంచి మద్దూరు కొండ మీదుగా తుళ్లూరు వరకూ వచ్చే జిల్లా రహదారి, మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వెళ్లే రహదారులను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు పెదకూరపాడు నుంచి అమరావతి, గుంటూరు రోడ్డును క్రాస్ చేస్తూ తుళ్లూరు వెళ్లే రోడ్డును, తాడికొండ నుంచి పెదపరిమి మీదుగా ఉన్న రహదారిని విస్తరించారు. గుంటూరు దాటిన తరువాత కంతేరు, నిడమర్రు, ఐనవోలు మీదుగా రహదారిని సైతం రెడీ చేశారు. ట్రాఫిక్ ను బట్టి ఏ వాహనం ఏ దారిలో వెళ్లాలన్న విషయాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సాధారణ ప్రజలు వాహనాల కోసం విజయవాడ-అమరావతి రోడ్డు మార్గంలో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలుగు ప్రజలు పండుగలా జరుపుకోవడం తోపాటు సుమారు 2 లక్షల మంది వరకూ హాజరయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 1500 వీఐపీలు వస్తున్నారు.