[caption id="attachment_429" align="aligncenter" width="350"]
గన్నవరం విమానాశ్రయంలో దిగి వేదికకు వచ్చే వారు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు దారిలో కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లి చేరుకోవాలి. తాడేపల్లి వద్ద వంతెన కింద నుంచి కుడివైపు తిరిగి పంప్ హౌస్, ఎన్టీఆర్ కట్ట మీదుగా ఉండవల్లి జంక్షన్‌కు, అక్కడి నుంచి ఉండవల్లి వంతెన దాటి ఎడమవైపు తిరిగి భీష్మాచార్య రోడ్డు మీదుగా ఉద్ధండరాయుని పాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకోవచ్చు. ఇది వీఐపీ పాసులున్న వారికి మాత్రమే. సాధారణ పాసులు ఉన్నవారు ఇదే దారిలో ఉండవల్లి జంక్షన్ నుంచి స్క్రూ బ్రిడ్జి మీదుగా వేదిక వద్దకు వెళ్లాల్సి వుంటుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు సైతం తాడేపల్లి వరకూ వచ్చి ఇదే దారిలో చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వారు నందిగామ, ఇబ్రహీంపట్నం దాటాక గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, రామవరప్పాడు మీదుగా బెంజ్ సర్కిల్ చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు గుంటూరు జిల్లా అమరావతి నుంచి మద్దూరు కొండ మీదుగా తుళ్లూరు వరకూ వచ్చే జిల్లా రహదారి, మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వెళ్లే రహదారులను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు పెదకూరపాడు నుంచి అమరావతి, గుంటూరు రోడ్డును క్రాస్ చేస్తూ తుళ్లూరు వెళ్లే రోడ్డును, తాడికొండ నుంచి పెదపరిమి మీదుగా ఉన్న రహదారిని విస్తరించారు. గుంటూరు దాటిన తరువాత కంతేరు, నిడమర్రు, ఐనవోలు మీదుగా రహదారిని సైతం రెడీ చేశారు. ట్రాఫిక్ ను బట్టి ఏ వాహనం ఏ దారిలో వెళ్లాలన్న విషయాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సాధారణ ప్రజలు వాహనాల కోసం విజయవాడ-అమరావతి రోడ్డు మార్గంలో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలుగు ప్రజలు పండుగలా జరుపుకోవడం తోపాటు సుమారు 2 లక్షల మంది వరకూ హాజరయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 1500 వీఐపీలు వస్తున్నారు.