తమిళనాడులో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లకు తగ్గట్లే ఏపీలోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి ఈ క్యాంటీన్ల ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నా.. క్యాంటీన్లను ఏర్పాటు చేసింది లేదు. రూ.5లకు బోజనం అందించటం ఈ అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశంగా చెప్పాలి.
అదే సమయంలో మరింత చౌకగా టిఫిన్లను కూడా ఈ క్యాంటీన్ల ద్వారా అందించాలని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తొలి క్యాంటీన్ ను ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తొలి అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమ్మక్యాంటీన్ల తీరును ఏపీ మంత్రులు తమిళనాడుకు వెళ్లి మరీ అధ్యయనం చేసి వచ్చారు. అక్కడి క్యాంటీన్ల పని తీరును పరిశీలించి.. మనకు తగ్గట్లుగా మార్పులుచేసి.. మరో పది రోజుల్లో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయనున్నారు.
తొలిదశలో భోజనాన్ని అందించటం.. తర్వాతి కాలంలో టిఫిన్లు అందించాలన్న అభిప్రాయం ఒక పక్క వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేకుండా రెండింటిని ఒకేసారి కలిపి వడ్డించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ కాంట్రాక్ట్ ను ఎవరికి అప్పగించాలన్న అంశంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఏమైనా.. అన్న క్యాంటీన్ ను పది రోజుల్లో స్టార్ట్ చేయటం మాత్రం ఖాయమని చెబుతున్నారు.
