Today is the 20th anniversary of NTR, Nandamuri Taraka Rama Rao
జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నటుడు, నాయకుడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన 20వ వర్ధంతి. 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు.
1949 లో 'మనదేశం' చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి ఆంధ్రుల అభిమానాన్ని చూరగొని 'నటరత్న' గా మన్ననలు పొందారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
'పాతాల భైరవి', 'మిస్సమ్మ', 'మాయా బజార్', 'గుండమ్మ కథ', 'రాముడు భీముడు', దాన వీర శూర కర్ణ', 'బొబ్బిలి పులి', 'వేటగాడు' ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సాధించారు. ఆయన తన అధ్బుత నటనతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలో రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయం సాధించి రికార్డు సృష్టించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు.
తెలుగువారి కీర్తి నలుదెసల్ వెదజల్లి తెలుగు రుచులనెల్ల తెలియజెప్పి కీర్తిఘనుడు యెక్కె గిన్నీసు బుక్కుల అతనికతడెసాటి అక్కిరాజ తెలుగు జాతికతడు తెచ్చిన ఖ్యాతి తో అయ్యె శాశ్వతుండు అవనిమీద అపరవిక్రమార్కుడన చెల్లునాతని అతని కతడె సాటి.
అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చివర రోజుల్లో తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురై జనవరి 18, 1996న కన్నుమూసారు.
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బాలకృష్ణ
తెలుగువారి ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్థంతి సందర్భంగా రసూల్‌పురాలోని విగ్రహం వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. శాంతి కపోతాలు ఎగురవేసి... అమర్ జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి చరమగీతం పాడింది ఎన్టీఆరే అని అన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే తెదేపాను నడిపిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రజాదరణ తెదేపాకు ఉందని బాలకృష్ణ అన్నారు.
ఎన్టీఆర్ కు కుటుంబసభ్యుల నివాళులు
భాగ్యనగరంలోని ఎన్టీఆర్ ఘాట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సోమవారం నాడు సూచించారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల కోసం అహర్నిషలు కృషి చేసిన ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి యువనేత నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడం సరికాదన్నారు.
చాలా పార్టీలలోని ముఖ్య నేతలకు భిక్ష పెట్టింది ఎన్టీఆరే అన్నారు. అలాంటి నేత ఘాట్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని చెప్పారు.
దేశానికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమన్నారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మార్పులు ఇతర రాష్ట్రాల్లోను అనుసరించారన్నారు. ఆయన వల్ల ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా జూలురుపాడు మండలం గుంటిపూడిలో సోమవారం నాడు ఎమ్మెల్యే వెంకట వీరయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
