యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ధైర్యం చేసి తన లేటెస్ట్ మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు. పొంగల్ పోటీ చాలా ఉన్నా నందమూరి అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా రిలీజ్ డేట్ ని అందుకోవడం కష్టసాధ్యమైనా.. అన్నిటినీ అధిగమించి నాన్నకు ప్రేమతో మూవీని చెప్పిన డేట్ కి రిలీజ్ చేశాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ టాక్ ని కూడా అందుకోగలిగాడు.
తొలిరోజు ఇండస్ట్రీ టాప్ 3 లోకి వసూళ్లు రాబట్టిన నాన్నకు ప్రేమతో తర్వాత కూడా అదే జోరు చూపించి ఇప్పటికే 20 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను క్రాస్ చేసేసింది. త్వరలోనే 50 కోట్ల మైలు రాయిని అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా అవతరించనుందనే అంచనాలు ఉన్నాయి. అయితే యూనిట్ పడ్డ ఇంత కష్టాన్ని బూడిదపాలు చేసేందుకు ఆస్ట్రేలియన్ పైరసీ ముఠా రంగంలోకి దిగింది. ఇప్పటికే నాన్నకు ప్రేమతో చిత్రం పైరసీ కాపీని విచ్చలివిడిగా అమ్మేస్తున్నారు.
ఎన్టీఆర్ గత చిత్రాలతో కలిపి కొత్త మూవీ నాన్నకు ప్రేమతోను కలిపి డీవీడీలుగా చేసి అమ్మేస్తున్నారు. ఇది కలెక్షన్లపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో వారం రోజులైనా నిలకడగా వసూళ్లు రాబడితే మాత్రమే.. ఎన్టీఆర్ మూవీ అధికారికంగా హిట్ జాబితాలోకి చేరుతుంది. ఆస్ట్రేలియా నుంచి మొదలైన పైరసీ ప్రింటింగ్ ఇప్పుడు అనేక దేశాలతోపాటు మన దేశంలో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తుండడంతో.. ఎన్టీఆర్ మూవీ రికార్డులపై అభిమానులు బెంగ పెట్టుకున్నారు.
