Showing posts with label Temple. Show all posts
Showing posts with label Temple. Show all posts

తిరుపతి లడ్డు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు




సాదారణంగా మనకు లడ్డు పేరు చెప్పగానే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల దగ్గర నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో తినేది తిరుపతి లడ్డు.
లడ్డూ అంటే మన తిరుపతి లడ్డూలే. ఆరుచి మన నాలుకను చేరుకొగానే మన మనస్సు అంతా ఒక్కసారి భక్తి భావంతో పులకరించి మైమరుస్తుంది. శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివి ఎన్ని రకాలు ఉన్న తిరుపతి లడ్డూ కున్న ప్రత్యేకత దేనికి లేదు.
పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు ప్రారంభం అయినప్పుడు మనం ఇపుడు చూస్తున్న లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ఒక ప్రత్యేకమైన పద్దతి అనేది ఒకటి ఉంది.
లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈ దిట్టం స్కేలును 1950లో మొదటిసారిగా రూపొందించారు. ఆ తర్వాత భక్తుల తాకిడిని బట్టి 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలు
ఈ మిశ్రమంతో దాదాపుగా 5,100 లడ్డూలు తయారవుతాయి. శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.
అయితే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని లడ్డుల తయారికి యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు. మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మాత్రమే వీటిని అందిస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో కల్యాణంలో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తారు.



రోడ్డుకి అనుకోని ఉన్న ఆలయాలు కూల్చివేత - పెద్ద ఎత్తున విమర్శలు




కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలోని ఆలయాల్ని పెద్ద ఎత్తున కూల్చివేసిన ఘటన సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. దీనిపై బాబు సర్కారు వెనక్కి తగ్గి.. ఇకపై దేవాలయాల్ని టచ్ చేయమని చెప్పటం తెలిసిందే. ఆలయాల కూల్చివేతపై మూడు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నా.. స్పందించని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రియాక్ట్ అయ్యారు. దేవాలయాల కూల్చివేత మీద ఆచితూచి మాట్లాడిన ఆయన.. మంత్రుల మాదిరి తప్పును అధికారుల మీద వేయకుండా.. జరిగిన ఘటనను సమర్థించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడిన వైనం కనిపించింది.

తమ సర్కారు చేసిన తప్పును కవర్ చేసేందుకు బాబు చాలానే కష్టపడినట్లు స్పష్టంగా కనిపించింది. ఎవరి మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించటం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్న చంద్రబాబు.. విజయవాడ నగరంలోని పలు దేవాలయాలు రహదారులను ఆనుకొని కట్టటం వల్లే లాంటి సమస్యలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. రోడ్లను విస్తరించాలన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కొందరు మీడియాను అడ్డం పెట్టుకొని అల్లర్లు రేపటానికి ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన మాటలు ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించాయి. అయితే.. దేవాలయాల్ని కూల్చిన ఘటనపై తమ మిత్రపక్షం బీజేపీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైనాన్ని బాబు ప్రస్తావించకుండా ఉండటం.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం.

మహిళలు ఆలయంలోకి చీరలోనే వెళ్లాలా?




లింగ వివక్ష - సమానత్వం అంటూ కోర్టుకు ఎక్కి దేవాలయాల్లో దశాబ్దాలుగా అమలవుతున్న పద్ధతులు తొలగించేలా చేసిన మహిళా సంఘాలు ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. పలు ప్రముఖ ఆలయాల్లో మహిళలు సంప్రదాయ చీరలనే ధరించి ప్రవేశించాలన్న నిబంధనలు ఉండగా ఇది వివక్షేనంటూ ఇటీవలి కాలంలో అనూహ్యంగా తెరపై కి వచ్చిన భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఆరోపించారు. వేసుకునే దుస్తులపై నిబంధనలు ఏమిటని ప్రశ్నించిన ఆమె - చీర స్థానంలో ప్యాంటు - కోటు వేసుకుని కొల్హాపూర్ లోని మహాలక్ష్మి దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రవేశించగా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయ నిబంధనల ప్రకారం చీరతోనే మహిళలు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పగా ఆమె మండిపడ్డారు. ఇష్టమొచ్చిన దుస్తులను ధరించనీయకుండా అడ్డుపడతారా? అని మండిపడ్డారు. 

దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో వస్త్ర నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు - కర్నాటకలోని పలు దేవాలయాలు పురుషులు షర్ట్ లేకుండా వస్తేనే అనుమతిస్తుండగా కేరళలో చాలా ఆలయాలు కేవలం పంచెతో వెళితేనే అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక మహిళల విషయానికి వస్తే ప్రముఖ దేవాలయాలెన్నో జీన్స్ - టీషర్ట్ - మినీస్ - షార్ట్స్ ధరించి వస్తే లోపలికి అనుమతించడం లేదు. తిరుమలలో సైతం మహిళలు చీర లేదా పంజాబీ డ్రస్ - చుడీదార్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. తాజాగా తృప్తీ దేశాయ్ అరెస్టుతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చినట్లయింది.

అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో రికార్డింగ్ డాన్సులు



తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి చెంత అపచారం చోటు చేసుకుంది. సత్యదేవుని సాక్షిగా ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం వెలుగులోకి వచ్చింది. దేవాలయంలోని హరిహరసధన్ వద్ద జరుగుతున్న ఓ వివాహవేడుకల్లో మహిళా డ్యాన్సర్స్ తో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి స్థానిక టీడీపీ సర్పంచ్ - ఎంపీపీ  తదితర నాయకులు కూడా హాజరై డ్యాన్స్ ల్లో మునిగిపోయారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ తతంగమంతా శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇలాంటి అసాంఘిక చర్యలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

  కాగా ఈ వ్యవహారంపై  మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో ఆలయ ఈవో చర్యలకు దిగారు. తెల్లవారు జామున 3 గంటలకు జరగడంతో నృత్యాల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి ఘటనపై విచారణ జరుపుతామని చెప్పిన ఆయన అనంతరం వాటిని పరిశీలించి నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించిన పెళ్లి బృందానికి కూడా నోటీసులు ఇచచారు. వారి నుంచి వచ్చిన వివరణను పరిశీలించిన తరువాత క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.