తమిళనాడులో కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టడానికి దాదాపుగా సిద్ధపడినట్లే. తమిళ రాజకీయాలు ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో కానీ.. ఇప్పుడు మాత్రం అచ్చంగా సినిమా పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నట్లు భావించాలి. జయలలిత మరణించిన తర్వాత.. తలైవా రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ సన్నాహాల్లో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఆయన సోదరుడు ఒక ముహుర్తం కూడా ప్రకటించి త్వరలోనే రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్న సంగతిని వెల్లడించారు. రజనీ ఇంకా తుదినిర్ణయానికి వచ్చేలోగానే కమల్ సునామీ మొదలైపోయింది. ప్రభుత్వంలోని అన్నిశాఖలూ అవినీతితో నిండిపోయాయని అంటూ కమల్ హాసన్ ఒక ప్రకపనను స్టార్ట్ చేశారు. సాక్ష్యాలు చూపించాలని మంత్రులు ఎదురు ప్రశ్నించడంతో ఆయన తన అభిమానులను పురిగొల్పారు. ఏయే శాఖల్లో ఎలాంటి అవినీతి ఉందో.. ఆయా మంత్రిత్వశాఖల వెబ్ సైట్లలో డైరక్టుగా ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కమల్ పిలుపునకు మంచి స్పందనే వచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో మెయిళ్లు - మెసేజీలు పెడుతుండడంతో.. మంత్రులు బెంబేలెత్తిపోయి.. వెబ్ సైట్ల నుంచి కాంటాక్ట్ అడ్రసులు - ఫోను నెంబర్లు మొత్తం తొలగించేశారు.
కమల్ హాసన్ ఇక రాజకీయ పార్టీ గురించిన ప్రకటన చేయడం ఒక్కటే తరువాయి అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోకే కమల్ రంగప్రవేశం ఉంటుందనే ఊహాగానాలు నడుస్తున్నాయి. తన చిత్రాల ద్వారా ఎంతో సామాజిక మార్పును అభిలషించిన దేశంలోనే గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న కమల్ హాసన్ తమిళ రాజకీయాల ప్రక్షాళనకు పూనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
