లండన్: మగవాళ్లు గడ్డం పెంచుకోవటం సాధారణమే. కానీ, ఆడవాళ్లు పెంచితే వింతే కదా. అంతేగాక, అతి చిన్న వయస్సులోనే భారీగా గడ్డం పెంచి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది ఓ యువతి. ఆమే బ్రిటన్‌కు చెందిన 24ఏళ్ల మోడల్ హర్నామ్ కౌర్. కాగా, కౌర్ గడ్డం పొడవు ఆరు అంగుళాలు.
హర్మాన్ కౌర్
ఆమె ముఖంపై గడ్డం మొలువడానికి కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే వ్యాధి అని వైద్యులు పేర్కొన్నారు. అయితే, హర్నామ్ కౌర్ తన గడ్డం కారణంగా ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొంటున్నట్లు గిన్నిస్ ప్రశంసా పత్రం పేర్కొంది. కాగా, తనకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కటంపై హర్నామ్ కౌర్ హర్షం వ్యక్తం చేశారు.
గిన్నిస్ రికార్డుతో ఇలా పెదవుల మీద, గడ్డంపై వెంట్రుకలు గల మహిళల్లో విశ్వాసం నింపడానికి తోడ్పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల తలపాగా, గడ్డంతో లండన్ ఫ్యాషన్ వీక్‌లోనూ పాల్గొన్నారు. అలా గడ్డంతో ర్యాంప్‌మీద నడిచిన తొలిమహిళగానూ హర్నామ్ రికార్డుసృష్టించారు.
గడ్డం మహిళగా గుర్తింపు
హర్నామ్ కౌర్‌కు అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. ఈ సమస్య గలవారికి మీసాలు, గడ్డం మొలుస్తుంటాయి. కౌర్‌కు యుక్తవయసు నుంచే గడ్డం, మీసాలు పెరగటం ఆరంభించింది. దీంతో తోటిపిల్లలు వేధించేవారు.
తనకు తానే మద్దతు
దీంతో ఎంతో వేదనకు గురయ్యే వారు హర్నామ్. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవాన్ని గ్రహించారు. నలుగురిలో ధైర్యంగా తిరగటం మొదలుపెట్టారు. అంతేగాక, తన ఫొటోలను సామాజిక మాధ్యమంలోనూ పెట్టారు. ‘బియర్డ్ డేమ్, బాడీ కాన్ఫిడెన్స్ యాక్టివిస్ట్, ప్లస్ సైజ్ మోడల్' అనీ హర్నామ్ తనకు తాను మద్దతు ప్రకటించుకున్నారు.