ఫేస్ బుక్.. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ చాలా డేంజరస్ గా మారుతోంది. మనుషుల మధ్య దూరాలు చెరిపేసిందని ముందు సంతోషించినా.. క్రమంగా మనిషి ప్రాణానికి ముప్పుగా మారుతోంది. ఫేస్ బుక్ పరిచయాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఫేస్ బుక్ లో అపరిచితులతో పరిచయాల కారణంగా గతంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. ఎంతోమంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మగాళ్లు కూడా చేరారు. ఫేస్ బుక్ లో పరిచయమైన గుర్తు తెలియన యువతి.. ఓ వ్యక్తి చనిపోవడానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలో దారుణం జరిగింది. ఖాజీపేటకు చెందిన వరప్రసాద్ టీ స్టాల్ నిర్వహిస్తూ బతుకుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతడికి ఫేస్ బుక్ లో ఓ యువత పరిచయమైంది. రోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. కొన్నాళ్లకు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని మాటలు కలిపారు. క్రమంగా వరప్రసాద్ ఆ యువతి మాయలో పడిపోయాడు. అతడు ఎంతగా ఆమె ఉచ్చులో పడిపోయాడంటే.. ఆమె ఎప్పుడు అగిడితే అప్పుడు, ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేవాడు. ఇలా పలు దఫాల్లో అప్పు చేసి మరీ.. మొత్తం 10లక్షల రూపాయలు ఆ యువతికి ముట్టజెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత తన డబ్బు తనకు వెనక్కి ఇవ్వాలని వరప్రసాద్ యువతిని అడిగాడు. అప్పటి నుంచి ఆమె అతడితో మాట్లాడటం తగ్గించింది. రేపు, మాపు అంటూ కాలయాపన చేసింది. ఈ క్రమంలో వరప్రసాద్ కు డబ్బు అప్పుగా ఇచ్చినవారు అతడిపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఓ వైపు పెరిగిన ఒత్తిడి, మరోవైపు మోసపోయాననే బాధ… మనస్థాపం చెందిన వరప్రసాద్.. ఓ రోజు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ యువతిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఆమె మూడు పేర్లతో వరప్రసాద్ తో తరుచుగా మాట్లాడేదని సమాచారం. ఎఫ్బీలో తన పేరును కల్యాణిగా పేర్కొన్న ఆమె.. ఫోన్లో మాట్లాడేటప్పుడు అనుశ్రీగా, కవితగా చెబుతుండేదని తెలిసింది.
మొత్తంగా ఈ ఘటన మగవాళ్లకు ఓ హెచ్చరిక లాంటిది. ఫేస్ బుక్ లో అపరిచితులతో, ముక్కూ-మోహం తెలియని అమ్మాయిలతో మాటలు కలపొద్దు. వారు చెప్పే సొల్లు కబుర్లకు పడిపోవద్దు. లేదంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది.
