ప్రతి ఇల్లు ఓ యజ్ఞశాల కావాలి! అంటూ వక్కాణించారు అమెరికాలో పర్యటిస్తూ టేనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ పట్టణంలో గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కుర్తాలం జగద్గురు, పరమాచార్య భారతి స్వామి. శ్రీ శ్రీ లాంటి మహాకవి కూడా "మరో ప్రపంచం, మరో ప్రపంచం" అంటూ నినదించారు. కానీ ఆ మరో ప్రపంచం భౌతిక చక్షవులకి కనిపించదు. అంతర్ముఖుడైన మనిషి భక్తి, ధ్యానం, జపం, తపం, మంత్రం, తంత్రం, హోమం, యజ్ఞం వల్ల ఆ మరో ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోగాలుగుతాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్ధాలతో పాటు ప్రేమ అనే ఐదవ గుణం అత్యంత ప్రధానమైనది.
భగవంతునిపట్ల అనన్యమయిన ప్రేమ, ఆరాధనా ముఖ్యమ్. ప్రతి మనిషి ఒక గోపిక కావాలి, కృష్ణ భగవానుని సాన్నిధ్యమే ధ్యేయం కావాలి. ఎంతటి థపొధనులైనా, దైవాంశ సంభూతులైన పరిమితమైన శక్తి సంపన్నులే. ఎవరైనా తాము అనంత శక్తి సంపన్నులమని, సృష్టి లోని జీవరాసుల సమస్యలన్నీ తొలగించగలమని, కష్టాలు, భాదల నుండి విముక్తి చేయగలమని నమ్మబలికితే అది ఆసత్యం మరియు ఆత్మవంచన. వందల, వేల కొట్లలో ఉండే మానవుల సమస్యలు, భాదలు ఏ ఒక్కరు తీర్చలేరు. కాగా ఎవరికి వారు సమస్యల నుండి బయటపడే విద్య నేర్చుకోవాలి. మనస్సు ఏకాగ్రత చేయగలిగినప్పుడు ధ్యానం సాధ్యం. ధ్యానం ద్వారా జీవితంలో ఒక నిశ్చలత, సమస్యల్ని పరిష్కరించుకోగల దైవ శక్తి వస్తుంది. నమ్మకం లేక పోయినా మంత్రోచ్చారణ వల్ల శక్తి పుడుతుంది. జపం, ధ్యానం కంటే హోమం శ్రేష్టం. కొన్ని వందల రెట్లు ఎక్కువ దైవ శక్తి పొందుతారు.
మంత్రం, తంత్రం తెలిసిన ఆధ్యాత్మిక సుసంపన్నుడు సిద్దేశ్వర స్వామి. తమిళనాడు కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠాదిపతి, శంకరాచార్య బిరుదాంకితులు, పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు, శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి ఉత్తర అమెరికాలో పర్యటనలో భాగంగా నవంబర్ 2, 3, 4 తారీఖులు టేనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ పట్టణంలో అనేక ప్రవాస భారతీయుల కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలసి హోమాలు, పూజలు చేయించారు. జగద్గురు తమ ప్రవచనంలో హోమ ప్రక్రియ గురించి ఈ విధంగా వివరించారు. హోమం ఎవరైనా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. హోమం చేయలనుకున్నప్పుడల్లా ఆగమ పండితుడో, అర్చకుడో, ఆచార్యుడో ఉండవలసిన నియమం లేదు. ఆచార్య ముఖత్వేనా, గురు సమక్షంలో చేసినప్పుడు ఎక్కువ ఫలితాలు వస్తాయి. హోమద్రవ్యాలు కూడా ఇవే ఉండాలనే నియమం ఏమీ లేదు. కానీ ఆ ఆ దేవతా ప్రీత్యర్ధం, నిర్దేశించిన పూజ మరియు హోమ ద్రవ్యాలతో చేసినప్పుడు విశేష ఫలితాలు చూరగొంటారు. ప్రతి దేవతమూర్తిని నిర్దిష్ట సంఖ్యలో మంత్రోచ్చారణ చేయవలసి వుంటుంది.
మంత్రోచ్చారణ చేసేకొద్దీ దేవతానుగ్రహం ఎక్కువగా వుంటుంది. హోమం, యజ్ఞం మరే పూజ కార్యక్రమమైన నిర్వహించడానికి ఇంటి కన్నా గుడి, ఆశ్రమం, పీఠం, పుణ్యక్షేత్రాలు శ్రేష్టం. పూరాణ కాలం నుండి మహాపురుషులు, సిద్ధపురుషులు హిమాలయాల్లో, పుణ్య క్షేత్రాల్లో, తీర్థాలలో పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులు చేసి సిద్ధి పొందిన వారే. మంత్రం అనేది వ్యక్తిగతం. ఎవరు లేనప్పుడు, విననప్పుడు బహిర్గంగా ఉచ్చారణ చేసిన ఫరవాలేదు. ప్రతి ఇల్లు ఒక యజ్ఞశాల కావాలి, ప్రతి ఒక్కరు యోగిగా ఎదగాలి, సిద్ధి పొందాలి. మానవ జీవితాన్ని విశ్లేషించి, మానవ మనుగడని నిర్దేసించ గల ఆధ్యాత్మిక భూమిక, శక్తి ఒక్క సనాతన ధర్మానికి, హిందూ మతానికే వుంది. మార్గం ఏదైనా భక్తి ప్రధానం, చిత్తశుద్ధితో చేయాలి. మంత్రం గత జన్మల పాపకర్మలనుండి విముక్తుల్ని చేస్తుంది. అలాగే భవిష్య పాపకర్మలకు దూరంగా ఉంచుతుంది. మానవుడు రుణ గ్రస్తుడు. దేవతా రుణం, రుషి రుణం, తల్లితండ్రుల రుణం, జాతి రుణం, దేశ రుణం ఇలా ఎన్నింటికో రుణపడి ఉంటాడు. ధార్మిక కార్యక్రమాలు చేసి రుణ విముక్తులు కావచ్చు. భక్తి ప్రధానం. ఏం చేసిన, ఎలా చేసిన చిత్తసుద్ధితో చేయాలి. మౌన జపం శ్రేష్టం. జపం లోంచి ధ్యానం సాధ్య పడుతుంది. సరైన గురువు దొరక్క పోయినా ఫరవాలేదు, సకల మంత్రాలకు ఆద్యుడు, సకల గణాలకు అధిపతి అయిన మహా శివుడిని ధ్యానించి, చిత్తసుద్ధితో ఏ మంత్రాన్ని ఉపాసించిన దైవానుగ్రహం కలుగుతుంది. శ్రద్ధ, సబూరి, సమిధి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ పురుషోత్తం తండు మరియు శ్రీ జనార్ధన రెడ్డి బొయేల ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీమతి సరిత తండు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు ప్రవచనానికి విచ్చేసిన అందరికి విందు భోజనం సమకూర్చారు.